Tuesday, November 23, 2010

భార్యే అద్దం



మనలో ఉన్న బలహీనతలు ఎవరైనా ఎత్తిచూపించినప్పుడు తెలుస్తాయి. లేదా మనం అంతర్ముఖులమై ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు అవగతమవుతాయి. మనలో ఉన్న బలహీనతలను నిస్సంకోచంగా ఎత్తిచూపించడాన్ని నేను క్లమెంటైన్ మిర్రర్ అని పేరు పెట్టాను. ఈ పేరు ఎందుకు పెట్టాననే అనుమానం మీకు వచ్చి ఉండచ్చు. బ్రిటన్ మాజీ ప్రధాని చర్చిల్‌కు ఆయన భార్య క్లమెంటైన్ ఒక లేఖ రాసింది. ఇది ఆయనలో ఉన్న బలహీనతలను చాలా స్పష్టంగా ఎత్తిచూపుతుంది. అందుకే నేను ఆ పేరు పెట్టాను. చాలాసార్లు భర్తలలో ఉన్న బలహీనతలను వారి భార్యలే ఎత్తిచూపగలుగుతారు. బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరూ ఆ పని అంత బాగా చేయలేరు.

భార్యలు చేసే వ్యాఖ్యలు చాలా క్రూరంగా అనిపించవచ్చు కాని అవి చాలా అమూల్యమైనవని చెప్పాలి. తమ బలహీనతలు తెలుసుకోవడానికి మేనేజర్లకు అనేక ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని పద్ధతుల్లో- తమ సహచరులు ఏమనుకుంటున్నారో మేనేజర్లు తెలుసుకోగలుగుతారు. అయితే ఇవి వినటానికి అంత ఆనందంగా ఉండవు. టాటా కంపెనీలో జరిగిన అలాంటి ఒక సంఘటనను ఇప్పుడు ఉదహరిస్తాను. టాటా గ్రూపులో మానవ వనరులకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించటానికి సీనియర్ డైరక్టర్లు, మేనేజర్లు ఒకసారి సమావేశమయ్యారు. ఉద్యోగులు తమకు తాము ఎలా ఎదగాలి, వివిధ రకాల నేతృత్వ శైలులు, సహచరులతో ఎలా మెలగాలి అనే అంశాల గురించి చర్చించారు.

  ఈ సమావేశంలో టాటా మానవ వనరుల విభాగం సభ్యులు తాము అభివృద్ధి చేసిన ఒక విధానాన్ని అందరి ముందు ఉంచారు. దీనికి టాటా రిఫ్లక్షన్స్ అని పేరు పెట్టారు. ఈ అంశం మీద చాలా సేపు చర్చ జరిగింది... ఈ సందర్భంలో ఒక మేనేజర్ తన స్వంత అనుభవాన్ని వివరించారు. ఆ అనుభవమేమిటంటే...

'నా సహచరులు, నా కింద పనిచేసేవారు.. నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత నేను దిగ్భ్రాంతి చెందాను. నేను అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానని అనుకొనేవాడిని. నా కింద పనిచేసేవారు- నేను ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయంతో వ్యవహరిస్తానని అనుకొనేవారు. నేను అందరిని స్వేచ్ఛగా మాట్లాడనిస్తానని అనుకొనేవాడిని. కాని నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడాలనుకొనేవారిని అడ్డుకొంటానని నా సహచరులు భావించేవారు. నా సహచరులతో ఉన్న అభిప్రాయభేదాలను సున్నితంగా చెబుతానని నేను భావించేవాడిని. నేను ఎవరి అభిప్రాయాలనూ సహించనని వారు అనుకొనేవారు.

ఇలా- నేను నా బలాలు అని ఏఏ అంశాలను భావించానో- అవన్నీ నా బలహీనతలుగా బయటపడ్డాయి.

నేను ఇంటికి వెళ్లిన తర్వాత నా శ్రీమతికి జరిగిన విషయమంతా చెప్పాను. "మీరు ఇంత అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీ బలహీనతలని నేను చెబుతూనే ఉన్నాను. ఈ అధ్యయనం కోసం ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. నాకు అప్పగిస్తే తక్కువ ఖర్చుకే అన్ని విషయాలు చెప్పేదానిని'' అని ఆమె అంది.

భర్తల బలహీనతలు భార్యలకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదనే విషయం ఆ రూమ్‌లో ఉన్న మా అందరికీ తెలుసు. నిర్మాణాత్మకమైన విమర్శ ద్వారా భర్తల్లో వారు ఎలాంటి మార్పు తేగలరో కూడా అందరికీ తెలుసు. మీ ముందే ఉన్న క్లెమంటైన్ అద్దంలో చూసుకోవాలా లేదా అనే విషయంపై ఇక తుది నిర్ణయం మీరే తీసుకోండి.

బోన్సాయ్ వల
నేను గత ముప్ఫై సంవత్సరాలుగా అనేక మంది మేనేజర్లను కలుస్తున్నాను. వారిని కలిసినప్పుడు రెండు ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పమంటాను. వాటిలో మొదటిది- 'నా చుట్టుపక్కల ఉన్న వారికన్నా నేను సమర్ధుడిని అని అనుకుంటున్నారా? లేదా?, ఇక రెండోది- 'నా చుట్టుపక్కల ఉన్న వారికన్నా నాకు మంచి మానవ సంబంధాలు ఉన్నాయా? లేదా?'. 'ఇతరుల కన్నా తాము సమర్ధులమని భావించే వారి సంఖ్య దాదాపు ఎనభై శాతం దాకా ఉంటుందని తేలింది. ఇది ఒక విధంగా పెద్ద వల. తాము ఇతరుల కన్నా సమర్ధులని భావించే వారు పడిపోయే పెద్ద వల.. దీనిలో రెండు పెద్ద ప్రమాదాలు ఉన్నాయి.

ఇతరులతో పోల్చుకోవటం వల్ల- మన బలాలను ఎక్కువ అంచనా వేసుకొని, బలహీనతలను తక్కువగా చూసే ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణం ఉండటం వల్ల మన బలహీనతలకు సంబంధించిన సంకేతాలు ముందే అందినా- వాటిని పట్టించుకోం. ఒక్క మాటలో చెప్పాలంటే- మన బలాలను ఎక్కువ చేసుకొని చూసుకుంటూ- బలహీనతలను పట్టించుకోం. దీనికి నేను పెట్టిన పేరు బోన్సాయ్ ట్రాప్. ఉదాహరణకు మన తోటివారిలో ఒకరికి ప్రమోషన్ వచ్చిందనుకుందాం. బోన్సాయ్ ట్రాప్‌లో పడిన వారు- అవతల వ్యక్తికి ఎందుకు ప్రమోషన్ వచ్చిందనే విషయాన్ని నిష్పాక్షికంగా ఆలోచించరు. అతనిని అకారణంగా ద్వేషించటం మొదలుపెడతారు. ఒక్క సారి ఈ ట్రాప్‌లో పడిన వారు- దాని నుంచి బయటకు రావటం చాలా కష్టం. కొద్ది మంది సమస్యను గమనించి దాని గురించి ఆలోచిస్తారు.

తాత్కాలికంగా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. మనలో ఉన్న బలహీనతలను అంగీకరించటానికి చాలా అంతర్మథనం అవసరం. మనలో ఉన్న బోన్సాయ్ వలల గురించి ఎవరూ మనకు చెప్పరు. మనంతట మనమే వాటిని గమనించి అధిగమించాలి. మనకు అవతల వ్యక్తి గురించి ప్రేమ ఉంటే- వారిలో ఉన్న బలహీనతలను కూడా చెప్పగలుగుతామని కొందరు అంటారు. అవతల వ్యక్తి గురించి పట్టించుకోనప్పుడు మాత్రమే వారిలో ఉన్న సుగుణాలను చెబుతామని కూడా అంటారు. కాని వాస్తవం ఇంత కచ్చితంగా ఉండదు. మనలో ఉన్న బోన్సాయ్ వలల గురించి మన బాస్‌లు మనకు చెప్పరు. సహచరులు కూడా చెప్పరు. బోన్సాయ్ వలల వల్ల కొందరికి తక్కువ ప్రమాదం ఉంటుంది. కాని కొందరికి మాత్రం గట్టి దెబ్బలే తగులుతాయి. అందువల్ల ఇతరులు మన గురించి చెప్పే విషయాలను శ్రద్ధగా వినటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

వెన్ ద పెన్నీ డ్రాప్స్
రచయిత: ఆర్.గోపాలకృష్ణన్

1 comment:

  1. చెప్పుడు మాటలలో విశ్వసనీయత ఉండాలనుకోవడం సమంజసం కాదు . కొన్ని సందర్భాలలో కాదనలేం కాని మనకు మనం గా కాకుండా ఇతరులనుండి తెలుసుకోవాలన్న ఆసక్తి వల్ల ఎక్కువ సార్లు చేటే సంభవిస్తుంది అని నా అభిప్రాయం . ...నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం .)

    ReplyDelete