Tuesday, November 23, 2010

భార్యే అద్దం



మనలో ఉన్న బలహీనతలు ఎవరైనా ఎత్తిచూపించినప్పుడు తెలుస్తాయి. లేదా మనం అంతర్ముఖులమై ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు అవగతమవుతాయి. మనలో ఉన్న బలహీనతలను నిస్సంకోచంగా ఎత్తిచూపించడాన్ని నేను క్లమెంటైన్ మిర్రర్ అని పేరు పెట్టాను. ఈ పేరు ఎందుకు పెట్టాననే అనుమానం మీకు వచ్చి ఉండచ్చు. బ్రిటన్ మాజీ ప్రధాని చర్చిల్‌కు ఆయన భార్య క్లమెంటైన్ ఒక లేఖ రాసింది. ఇది ఆయనలో ఉన్న బలహీనతలను చాలా స్పష్టంగా ఎత్తిచూపుతుంది. అందుకే నేను ఆ పేరు పెట్టాను. చాలాసార్లు భర్తలలో ఉన్న బలహీనతలను వారి భార్యలే ఎత్తిచూపగలుగుతారు. బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరూ ఆ పని అంత బాగా చేయలేరు.

భార్యలు చేసే వ్యాఖ్యలు చాలా క్రూరంగా అనిపించవచ్చు కాని అవి చాలా అమూల్యమైనవని చెప్పాలి. తమ బలహీనతలు తెలుసుకోవడానికి మేనేజర్లకు అనేక ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని పద్ధతుల్లో- తమ సహచరులు ఏమనుకుంటున్నారో మేనేజర్లు తెలుసుకోగలుగుతారు. అయితే ఇవి వినటానికి అంత ఆనందంగా ఉండవు. టాటా కంపెనీలో జరిగిన అలాంటి ఒక సంఘటనను ఇప్పుడు ఉదహరిస్తాను. టాటా గ్రూపులో మానవ వనరులకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించటానికి సీనియర్ డైరక్టర్లు, మేనేజర్లు ఒకసారి సమావేశమయ్యారు. ఉద్యోగులు తమకు తాము ఎలా ఎదగాలి, వివిధ రకాల నేతృత్వ శైలులు, సహచరులతో ఎలా మెలగాలి అనే అంశాల గురించి చర్చించారు.

  ఈ సమావేశంలో టాటా మానవ వనరుల విభాగం సభ్యులు తాము అభివృద్ధి చేసిన ఒక విధానాన్ని అందరి ముందు ఉంచారు. దీనికి టాటా రిఫ్లక్షన్స్ అని పేరు పెట్టారు. ఈ అంశం మీద చాలా సేపు చర్చ జరిగింది... ఈ సందర్భంలో ఒక మేనేజర్ తన స్వంత అనుభవాన్ని వివరించారు. ఆ అనుభవమేమిటంటే...

'నా సహచరులు, నా కింద పనిచేసేవారు.. నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత నేను దిగ్భ్రాంతి చెందాను. నేను అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానని అనుకొనేవాడిని. నా కింద పనిచేసేవారు- నేను ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయంతో వ్యవహరిస్తానని అనుకొనేవారు. నేను అందరిని స్వేచ్ఛగా మాట్లాడనిస్తానని అనుకొనేవాడిని. కాని నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడాలనుకొనేవారిని అడ్డుకొంటానని నా సహచరులు భావించేవారు. నా సహచరులతో ఉన్న అభిప్రాయభేదాలను సున్నితంగా చెబుతానని నేను భావించేవాడిని. నేను ఎవరి అభిప్రాయాలనూ సహించనని వారు అనుకొనేవారు.

ఇలా- నేను నా బలాలు అని ఏఏ అంశాలను భావించానో- అవన్నీ నా బలహీనతలుగా బయటపడ్డాయి.

నేను ఇంటికి వెళ్లిన తర్వాత నా శ్రీమతికి జరిగిన విషయమంతా చెప్పాను. "మీరు ఇంత అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీ బలహీనతలని నేను చెబుతూనే ఉన్నాను. ఈ అధ్యయనం కోసం ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. నాకు అప్పగిస్తే తక్కువ ఖర్చుకే అన్ని విషయాలు చెప్పేదానిని'' అని ఆమె అంది.

భర్తల బలహీనతలు భార్యలకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదనే విషయం ఆ రూమ్‌లో ఉన్న మా అందరికీ తెలుసు. నిర్మాణాత్మకమైన విమర్శ ద్వారా భర్తల్లో వారు ఎలాంటి మార్పు తేగలరో కూడా అందరికీ తెలుసు. మీ ముందే ఉన్న క్లెమంటైన్ అద్దంలో చూసుకోవాలా లేదా అనే విషయంపై ఇక తుది నిర్ణయం మీరే తీసుకోండి.

బోన్సాయ్ వల
నేను గత ముప్ఫై సంవత్సరాలుగా అనేక మంది మేనేజర్లను కలుస్తున్నాను. వారిని కలిసినప్పుడు రెండు ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పమంటాను. వాటిలో మొదటిది- 'నా చుట్టుపక్కల ఉన్న వారికన్నా నేను సమర్ధుడిని అని అనుకుంటున్నారా? లేదా?, ఇక రెండోది- 'నా చుట్టుపక్కల ఉన్న వారికన్నా నాకు మంచి మానవ సంబంధాలు ఉన్నాయా? లేదా?'. 'ఇతరుల కన్నా తాము సమర్ధులమని భావించే వారి సంఖ్య దాదాపు ఎనభై శాతం దాకా ఉంటుందని తేలింది. ఇది ఒక విధంగా పెద్ద వల. తాము ఇతరుల కన్నా సమర్ధులని భావించే వారు పడిపోయే పెద్ద వల.. దీనిలో రెండు పెద్ద ప్రమాదాలు ఉన్నాయి.

ఇతరులతో పోల్చుకోవటం వల్ల- మన బలాలను ఎక్కువ అంచనా వేసుకొని, బలహీనతలను తక్కువగా చూసే ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణం ఉండటం వల్ల మన బలహీనతలకు సంబంధించిన సంకేతాలు ముందే అందినా- వాటిని పట్టించుకోం. ఒక్క మాటలో చెప్పాలంటే- మన బలాలను ఎక్కువ చేసుకొని చూసుకుంటూ- బలహీనతలను పట్టించుకోం. దీనికి నేను పెట్టిన పేరు బోన్సాయ్ ట్రాప్. ఉదాహరణకు మన తోటివారిలో ఒకరికి ప్రమోషన్ వచ్చిందనుకుందాం. బోన్సాయ్ ట్రాప్‌లో పడిన వారు- అవతల వ్యక్తికి ఎందుకు ప్రమోషన్ వచ్చిందనే విషయాన్ని నిష్పాక్షికంగా ఆలోచించరు. అతనిని అకారణంగా ద్వేషించటం మొదలుపెడతారు. ఒక్క సారి ఈ ట్రాప్‌లో పడిన వారు- దాని నుంచి బయటకు రావటం చాలా కష్టం. కొద్ది మంది సమస్యను గమనించి దాని గురించి ఆలోచిస్తారు.

తాత్కాలికంగా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. మనలో ఉన్న బలహీనతలను అంగీకరించటానికి చాలా అంతర్మథనం అవసరం. మనలో ఉన్న బోన్సాయ్ వలల గురించి ఎవరూ మనకు చెప్పరు. మనంతట మనమే వాటిని గమనించి అధిగమించాలి. మనకు అవతల వ్యక్తి గురించి ప్రేమ ఉంటే- వారిలో ఉన్న బలహీనతలను కూడా చెప్పగలుగుతామని కొందరు అంటారు. అవతల వ్యక్తి గురించి పట్టించుకోనప్పుడు మాత్రమే వారిలో ఉన్న సుగుణాలను చెబుతామని కూడా అంటారు. కాని వాస్తవం ఇంత కచ్చితంగా ఉండదు. మనలో ఉన్న బోన్సాయ్ వలల గురించి మన బాస్‌లు మనకు చెప్పరు. సహచరులు కూడా చెప్పరు. బోన్సాయ్ వలల వల్ల కొందరికి తక్కువ ప్రమాదం ఉంటుంది. కాని కొందరికి మాత్రం గట్టి దెబ్బలే తగులుతాయి. అందువల్ల ఇతరులు మన గురించి చెప్పే విషయాలను శ్రద్ధగా వినటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

వెన్ ద పెన్నీ డ్రాప్స్
రచయిత: ఆర్.గోపాలకృష్ణన్

Friday, October 1, 2010

అపార్థమా నీ ఊరేది .... సత్యాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఒక అర్థంలో వదిలిన వాక్యం కొన్నిసార్లు మరో అర్థంతో ఎదుటి వారి మనసున వాలిపోతుంది. మాట అనడంలోనో వినడంలోనో ఎక్కడ పొరబడినా అపార్థం భగ్గుమంటుంది.

అప్పటిదాకా మమతలూరిన బంధం కాస్తా మంటల పాలవుతుంది. ఎందుకిలా? అంటే కారణాలేవో ఉంటాయి. ఇప్పుడెలా? అంటే ఆ మంటల్ని ఆర్పే మార్గాలూ ఉంటాయి. కాకపోతే విషయం మీద బాగా మనసు పెట్టాలి మరి!

జీవితాంతం కలిసే బతుకుదామని, కష్టాలూ, కన్నీళ్లూ కలిసే పంచుకుందామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎడతెగకుండా జీవిద్దామని ఎన్నెన్నో బాసలు చేసిన స్నేహాలు ఈ రోజు లేవు. జీవన యాత్రలో ఒకరికొకరు తోడై ప్రాణంలో ప్రాణమై కడ ఊపిరి దాకా కలిసే ఉందామనుకున్న ప్రేమలు ఈ రోజు లేవు. అపార్థాల సుడిగాలిలో ఇలా ఎన్నెన్నో బంధాలు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. కనీసం ఆనవాళ్లయినా లేకుండా చెల్లాచెదరైపోయాయి. ఆశలన్నీ నిరాశలు చేసి అర్థాంతరంగా ఎటో వెళ్లిపోయాయి.

ఎందుకిలా జరిగిందని ఎవరికి వారు ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా స్పష్టమైన సమాధానమేదీ దొరకదు. ప్రతి అపార్థం వెనుక అన్నేసి కారణాలుంటాయి మరి! వాటిలో అప్పటికప్పుడు తలెత్తినవి కొన్నయితే, ఎప్పటినుంచో గూడుకట్టుకుని పర్వతంలా పెరిగిపోయినవి కొన్ని. పరిశీలిస్తే ఎక్కడా అపార్థాలకు తావివ్వని జీవితమే కనిపించదు. కాకపోతే అపార్థాల్లో కొన్ని కొద్ది రోజుల పాటు ఉండి తొలగిపోతాయి. మరికొన్నేమో జీవితాంతం వెన్నంటి నడుస్తాయి. జీవితాన్నొక అగ్నిగుండం చేస్తూ అలా బతికేస్తాయి.

మూలాలు ఏవి?
అసలీ అపార్థాలేమిటి? వీటి ఉనికేమిటి? ఊరేమిటి? ఇవి ఎక్కడినుంచి పుట్టుకొస్తాయి? అంటే ఇవేవీ ఆకాశంలోంచి ఏమీ పుట్టుకు రావు. వాస్తవాల్ని వక్రీకరిస్తే అవే అపార్థాలవుతాయి. ఈ అపార్థాలు ఒక్కోసారి వాస్తవాలనుంచి మొత్తంగానే పక్కకు జరిగిపోయి అవి పూర్తి స్తాయి అబద్ధాలైపోవచ్చు.

అందుకే "అపార్థానికి గురైన సత్యం కంటే ఘోరమైన అబద్ధం మరొకటి లేదు.'' అంటాడు మానసిక వేత్త విలియమ్ జేమ్స్. ఇంతకీ వాస్తవాలు వక్రీకరణకు గురికావడానికి కారణమేమిటి? ఈ అపార్థాలేమిటి? అంటే చాలాసార్లు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మానసిక స్థాయి లేకపోవడమో లేదా విషయాన్ని వ్యతిరేక కోణంలోంచి చూడటమో కారణంగా కనిపిస్తాయి.

ఎదుటి వ్యకి ్తని అసలు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయకపోవడం కూడా కారణం కావచ్చు. ఎదుటి వారి విలువల మీద ఏమాత్రం గౌరవం గానీ సదభిప్రాయం లేకపోవడం కూడా కారణం కావచ్చు. అలాగే ఆలోచనలకూ, చర్యలకూ మనకు తెలియని ముఖాలు కూడా ఉంటాయనే సత్యాన్ని గుర్తించకపోవడం వల్ల కూడా అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఇవే కాకుండా ఎదుటి వారి పరిమితులను, వారి సమస్యలను గుర్తించకపోవడం, వాటి పట్ల ఏమాత్రం సానుభూతి లేకపోవడం కూడా అపార్థాలకు కారణం కావచ్చు.

ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప అపార్థాలు హఠాత్తుగా వచ్చిపడే పరిణామాలు కావు. చాలా వరకు ముందునుంచే ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న అయిష్టత, అవిశ్వాసాలు, అసూయా ద్వేషాలే వీటి వెనుక ఉంటాయి. ద్వేషానికి ప్రత్యక్ష వైరమే ఉండనవసరం లేదు. జీవనశైలి పట్లగానీ, ఒకరి భావజాలం పట్ల మరొకరికి ఉన్న వ్యతిరేకత కూడా అపార్థాలకు దారి తీయవచ్చు. ఇవేవీ కాకుండా ఒకరి పట్ల మరొకరికి ఉన్న అనుమానాలు కూడా కారణం కావచ్చు.

దూరాలు చేరితే...
ఏమైనా అపార్థాలు అంకురించడం చాలా సులభం. కానీ, వాటిని తొలగించడమే చాలా కష్టం. పోనీ, ఒకే ప్రదేశంలో ఉంటూ రోజూ కలిసే వారైతే, అప్పుడో ఇప్పుడో వాటిని తొలగించుకునే అవకాశమైనా ఉంటుంది. అలా కాకుండా ఏ దూర ప్రాంతం నుంచో వచ్చిన వారితో అయితే దాన్ని తొలగించుకునే అవకాశమే మళ్లీ రాకపోవచ్చు.

అపార్థానికి గాయపడిన వ్యక్తి ఎదురుగా ఉంటే అతని ముఖ కవళికలను గమనించి వెంటనే సర్దిచెప్పుకునే అవకాశమైనా ఉంటుంది. కొందరు అలా బయటికేమీ కనిపించనివ్వరు. కానీ, ఆ మాటను ఏళ్ల పర్యంతం మనసులో ఉంచేసుకుంటారు. అలాగే ఫోన్‌లోనో, మేల్ ద్వారానో తలెత్తిన అపార్థాలు కూడా కొన్ని సార్లు అలాగే గూడుకట్టుకుని ఉంటాయి.

ఇలాంటి స్థితిలో బంధాలు శాశ్వతంగా తెగిపోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక విషయంలో మనకు స్పష్టత లేనప్పుడు అసలు మాట్లాడకపోవడమే మేలు. ఏదో అనుకుని మరేదో మాట్లాడేస్తే అవి అపార్థాలకే దారి తీస్తాయి. ఆ తరువాత నా ఉద్దేశం అది కాదు మొర్రో అని ఎంత అరిచి గీపెట్టినా కొన్ని సార్లు ప్రయోజనం ఉండకపోవచ్చు.

కొందరికి ప్రతి చిన్న విషయానికీ విపరీతార్థాలు తీసే స్వభావం ఉంటుంది. ఎదుటి వారు ఏంమాట్లాడినా అది వారికి తప్పుగానే కనపడుతుంది. ఇలాంటి వారు ఎవరితోనూ ఎక్కువ కాలం స్నేహంగా ఉండలేరు. చివరికి అందరికీ దూరమై ఏకాకిలా మిగిలిపోతారు.

సానుభూతి చాలు
అసలు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా అన్ని సార్లూ అంతే అర్థవంతంగా, అపార్థాలకు ఏ మాత్రం తావు లేకుండా మాట్లాడగలడా? అది సాధ్యం కాదనే విషయాన్ని గుర్తిస్తే ఎన్నో అపార్థాలకు అసలు స్థానమే ఉండదు. పైగా ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడితే దానికంతా ఆ వ్యక్తినే బాధ్యుణ్ని చేయకుండా అతని వెనుకున్న పరిస్థితులేమిటో కూడా చూడాలి.

అందుకే ఎదుటి వారి మాటలను సానుభూతితో అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకే "సానుభూతి, సదవగాహన, క్షమ ఈ మూడే అపార్థాలకు బలమైన అడ్డుకట్టలు'' అంటాడు మనోవిశ్లేషకుడు రష్ డోషియర్. ప్రపంచంలో సంపూర్ణ మానవులంటూ ఎవరూ లేరు కదా! ఇలాంటి స్థితిలో మనిషి ప్రతి మాటా అంత సర్వ సమగ్రంగా ఎలా ఉంటుంది? ఎంత వారలైనా అప్పుడో ఇప్పుడో తప్పులు దొర్లకుండా పోవు.

ఆ తప్పు అతనిలోనే ఉందా? లేక మనం అర్థం చేసుకోవడంలో ఉందా? అన్నది మళ్లీ ఎప్పుడూ ప్రశ్నే. ఎంత జాగ్రత్తపడినా అపార్థాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అప్పుడే ఒకరినొకరు మన్నించుకోవడం వీలవుతుంది. అప్పుడే మనసులు మళ్లీ కలసిపోవడం సాధ్యమవుతుంది. 
జూ బమ్మెర

Friday, September 24, 2010

సత్‌పౌరులూ .. - సంపన్నులూ ...

ఈశతాబ్ది ఆరంభంలో మా ఊరు బెంగళూరు,ఆర్థిక ప్రపంచీకరణ సత్ఫలితా లకు ఒక ఉదాహరణ అయింది. సరళీకృత ఆర్థిక విధానాలతో సమకూరుతు న్న లబ్ధిని భారతీయులకు బెంగళూరే విశదం చేసింది. నగరానికి గర్వకారణమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ, బహుళజాతి కంపెనీలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలను సమకూర్చడం ద్వారా దేశానికి అపార విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జిస్తోంది.

వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టించింది. సంప్రదాయక వస్తూత్పత్తి రంగంతో పోలిస్తే ఈ కొత్త పరిశ్రమతో పర్యావరణానికి హాని చాలా తక్కువ.

ఐటి కంపెనీల వ్యవస్థాపకులు సామాన్య, మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చినవారు కావడం వల్ల ఆ వ్యాపార రంగ శీఘ్ర పురోభివృద్ధి ప్రజలలో అమితాసక్తిని రేకెత్తించింది. వారసత్వంగా కాక స్వయంకృషితో సంపాదించుకున్న అపరిమిత ధనరాశులను సమాజ శ్రేయస్సుకు వినియోగించడంలో ఐటి ఐశ్వర్యవంతులు ఉదారంగా వ్యవహరిస్తున్నారు.

ఈ విషయంలో ఇన్ఫోసిస్‌ది  ప్రశంనీయమైన ఆదర్శం. తాము నెలకొల్పి, అభివృద్ధి చేసిన సంస్థ నుంచి తమ బిడ్డలను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచిన కొత్త యాజమాన్య విలువల వైతాళికులు ఇన్ఫోసిస్ డైరెక్టర్లు. విలాసపూరిత జీవితాలకు స్వస్తి చెప్పి నిరాడంబర పూరిత జీవన శైలిని వారు అలవర్చుకున్నారు.

సంపదను అందరికీ ఆడంబరంగా ప్రదర్శించే సంపన్న వాణిజ్య వర్గాల సభ్యతారహి త ధోరణికి ఇన్ఫోసిస్ వారి వ్యవహరణ పూర్తి విరుద్ధం.

విద్య, ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణ మొదలైన సామాజిక అంశాలకు పెద్ద ఎత్తున ఉదారంగా నిధులు సమకూర్చడం ద్వారా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ప్రజల్లో మరింత మంచి పేరు సముపార్జించుకున్నారు.

నా సొంత రాష్ట్రమైన కర్ణాటక ఈ దశాబ్ది తొలినాళ్ళలో ఆర్థిక ప్రపంచీకరణ దుష్ఫలితాలకు ఒక ప్రతీక అయింది. ప్రభుత్వ సమాచారం ప్రకారమే 2000-10 సంవత్సరాల మధ్య కర్ణాటక నుంచి కనీసం మూడు కోట్ల టన్నుల ముడి ఇనుము చట్ట విరుద్ధంగా ఎగుమతి అయింది.

సరైన లైసెన్స్ లేకుండా, అవసరమైన పన్నులు చెల్లించకుండానే అధికారికంగా 'అడవి'గా గుర్తింపబడిన ప్రాంతాలలో ఆ ముడి ఖనిజపు తవ్వకాలు జరిగాయి. ముడి ఇనుమునుపెద్ద ఎత్తున దిగుమతి చేసుకొంటోన్న చైనా కు మరింతగా ఆ ఖనిజాన్ని ఎగుమతిచేసి ఇతోధిక లబ్ధి పొందడానికి కర్ణాటక సంకల్పించుకొంది.

ఐరన్ ఓర్ మైనింగ్‌కు విచక్షణా రహితంగా అనుమతి ఇవ్వడం ద్వారా బళ్ళారి జిల్లాలో సామాజిక, పర్యావరణ విధ్వంసాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పక తప్పదు.

బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు భారీ వేతన భత్యాలు లభిస్తాయి; శుభ్రమై న, ఆరోగ్యవంతమైన, నియంత్రిత వాతావరణంలో వారు పనిచేస్తారు. ఆరోగ్య భద్ర తా సదుపాయాలు వారికి పూర్తిగా అందుబాటులో ఉంటాయి. మరి బళ్ళారిలోని గని కార్మికులకు చట్టం ప్రకారం చెల్లించాల్సిన కనీస వేతనాల కంటే తక్కువే చెల్లిస్తా రు. మండే ఎండలో దాదాపు పగలంతా పనిచేస్తారు.

పనిచేస్తున్నంత సేపూ కాలుష్యకోరల్లో ఉంటారంటే అతిశయోక్తిలేదు. మైనింగ్‌తో పోల్చితే ఆటో మోబైల్, ఐటి పరిశ్రమలు భూగర్భ సంపదను తక్కువగా వినియోగించుకొంటాయి. ముఖ్యంగా ఐటి పర్యావరణ కాలుష్యానికి ఏ మాత్రం దోహదం చేయని పరిశ్రమ.

ముడి ఇనుము కోసం జరుగుతోన్న అన్వేషణలో బళ్ళారి అడవులు తరిగిపోతున్నాయి; బళ్ళారి నేల లు పంటల సాగుకు పనికి రాకుండాపోతున్నాయి. జల వనరులపై చాలా తీవ్ర ప్రభావం పడుతోంది. నదులు కాలుష్య కూపాలుగా మారిపోతున్నాయి.

కార్మికుల స్థితిగతులు, పర్యావరణ పరిస్థితి దృష్ట్యా బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ పరిశ్రమల, బళ్ళారిలోని ఐరన్ ఓర్ మైనింగ్ మధ్య వ్యత్యాసాలు అపారం. ఈ రెండు రంగాలలోని కంపెనీల వ్యవస్థాపకుల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు వారి మధ్య తారతమ్యాలు మరింత ఎక్కువగా కన్పిస్తాయి. సాప్ట్‌వేర్ సంపన్నులు ఉత్తమ పౌరులు. వారు తమ సంపదలో చాలా భాగా న్ని తిరిగి సమాజానికి ఇస్తున్నారు. అయితే బళ్ళారి గనుల ఆసాములు వారికి వారే ప్రభువులు.

చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. జిల్లాలోని పోలీసు, పౌర యంత్రాంగంమంతా వారికి దాసోహ మే. వారి మాటకు తిరుగులేదు. మరే భారతీయ నగరంలో లేని విధంగా బళ్ళారిలో అత్యధిక తలసరి మెర్సిడీజ్ కార్లు ఉన్నాయి.

పాఠశాలలకు, ఆస్పత్రులకు బళ్ళా రి గనుల ఆసాములు ఉదారంగా ఆర్థిక సహాయమందించినట్టు నేను ఇంతవరకు వినలేదు, చదవలేదు. వారు ఒకే ఒక్క విలువైన కానుకను ఇచ్చారు-అది తిరుపతి వేంకటేశ్వరస్వామికి . 45 కోట్ల రూపాయల విలువైన వజ్రాల కిరీటాన్ని ఆ స్వామికి సమర్పించుకున్నారు.తమ చట్టోల్లంఘనలను, నైతిక విలువల అతిక్రమణలను పట్టించుకోవద్దని దేవుళ్ళను వేడుకోవడానికే బహుశా వారు ఆ వితరణ చూపి ఉంటారు.

బళ్ళారి గనుల ఆసాములు తిరుపతి స్వామికేనా కానుకలు సమర్పించుకొంది? కానే కాదు. రాజకీయ పార్టీలకూ వారు విలువైన కానుకలే ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రచార వ్యయాన్ని పూర్తిగా వారే భరించారనేది విశ్వసనీయ జనశృతి. బిజెపి, దాని మిత్రపక్షాలకు మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తో బళ్ళారి గనుల ఆసాములకు ఏకంగా మూడు కేబినెట్ మంత్రి పదవులు లభించా యి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ పరిణామాల పట్ల అసంతృప్తితో ఉందని అంటున్నారు. అవినీతిపరులైన అవకాశవాదులను అందలాలెక్కించడం పార్టీకి మంచిది కాదని ఆరెస్సెస్ పెద్దలు భావించారు. అయితే బిజెపి నాయకత్వం వారి అభ్యంతరాలను తోసిపుచ్చింది.

ఒక దక్షిణాది రాష్ట్రంలో తక్షణమే అధికారానికి రావాల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతైనా ఉంది మరి. సరే, గనుల యజమానులలో కొంతమంది బిజెపి పక్షాన ఉండగా మరికొందరు కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నారు.

వారిలో కొందరు కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఎన్నికలలో పోటీ చేయడం కూడా జరిగింది. వాస్తవానికి కర్ణాటక బిజెపి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురు మహాశయుల ను తొలుత ప్రోత్సహించింది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ సహాయ సహకారాలు కూడా ఆ ముగ్గురికీ పూర్తిగా ఉన్నాయనే విషయాన్ని మనం విస్మరించకూడదు.

బళ్ళారి గనుల ఆసాముల ఉత్థానంపై పరంజోయ్ గుహ థాకుర్తా ప్రస్తుతం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా న్యూఢిల్లీ లో నివసిస్తున్నప్పటికీ తన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న వ్యక్తి థాకుర్తా. అనుభజ్ఞుడైన పాత్రికేయుడు.

సహచర పాత్రికేయులు అమితంగా గౌరవిం చే మాన్యు డు థాకుర్తా. తూర్పు భారత రాష్ట్రాలలో మైనింగ్ కార్యకలాపాల రాజకీయ, సామాజిక, పర్యావరణ పర్యవసానా లు విస్తృతంగా అధ్యయనం చేసిన సామాజిక వేత్త థాకు ర్తా. బళ్ళారి గనుల ఆసాములపై డాక్యుమెంటరీ నిర్మాణంలో ఆ అనుభవం ఆయనకు ఎంతైనా ఉపకరించగలదనడంలో సందేహం లేదు.

బళ్ళారిలో షూటింగ్ అనంతరం థాకుర్తా ఇటీవల బెంగళూరు వచ్చారు. నేరస్తు లు, వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలు ఇంతగా కుమ్మక్కవడం కర్ణాటక మైనింగ్ కార్యకలాపాలలోనే మొట్ట మొదటిసారిగా కన్పిస్తుందని థాకుర్తా అన్నారు. గతంలో ముంబైమస్తాన్ ఒకరు అప్పుడప్పుడూ ఎన్నికలలో పోటీచేసేవాడు. ఇతర మస్తాన్ లు అందరూ ఆ 'రాజకీయవేత్త'కు మద్దతు నిచ్చేవారు.

అయితే చట్ట విరుద్ధంగా, పైగా హింసాత్మక పద్ధతులలో కూడా ఆస్తులు కూడబెట్టుకున్న వారు ఒక భారతీయ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకోవడమనేది ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

ఇక్కడ సంక్షేపించిన రెండు గాథల- బెంగళూరు సాఫ్ట్‌వేర్ సంపన్నుల, బళ్లారి గనుల ఆసాముల-విశాల పాఠాలు ఏమిటి? ప్రపంచీకరణకు శుభప్రదమైన పార్శ్వ మే కాదు, దుర్మార్గమైన పార్శ్వమూ ఉంది. ఇంధనాన్ని అంతగా ఉపయోగించుకోని, పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులను నాలెడ్జ్ వర్కర్స్ సృష్టించే అవకాశాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కల్పించినప్పుడు వాటిని మనం పూర్తిగా వినియోగించుకోవాలి.

అయితే అందుకు బదులుగా అసలే తరిగిపోతోన్న సహజ వనరులను, పర్యావరణ ఆరోగ్యాన్ని విస్మరించి శీఘ్రగతిన వినియోగించుకోవడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనలను ప్రేరేపిస్తే ప్రపంచీకరణ ఉపయుక్తతను మనం సంశయించి తీరాలి.

మనకు అపార మానవ, సహజ వనరులు ఉన్న దృష్ట్యా ప్రపంచీకరణను మన శ్రేయస్సుకు ఉపయోగించుకోవడం ఎలా అన్నది ప్రభుత్వ విధానానికి సంబంధించిన విషయం. సంపదను ఎలా సమకూర్చుకోవాలి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. అపర కుబేరులమయి పోదామనే ఆరాటంలో బళ్ళారి గనుల ఆసాములు చట్టాన్ని పాటించలేదు; సహచర పౌరుల శ్రేయస్సునూ పట్టించుకోలేదు.

అయితే బెంగళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీల వ్యవస్థాపకులు తమ ఐశ్వర్యాన్ని న్యాయబద్ధంగా సముపార్జించుకున్నారు. అందులో స్వల్ప భాగాన్ని తమ సొంతానికి వాడుకున్నారు; గణనీయమైన భాగాన్ని వివిధ దాతృత్వ, లోకకల్యాణ కార్యకలాపాలకు వినియోగించారు.

దశాబ్ద కాలంలోనే మా ఊరు, మా రాష్ట్రం ప్రపంచీకరణ మంచీ, చెడూ రెండిటికీ లోనయ్యాయి. ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానం ఆవిర్భావంతో మంచి జరుగగా అనాగరిక పెట్టుబడిదారీ వ్యవస్థ దానిని బలహీనపరచడంతో చెడు సంభవిస్తోంది. 

-రామచంద్రగుహ