Thursday, May 14, 2009

ఎవరు గెలిచారు ?

తెలంగాణ మళ్లీ ఓడవద్దు

కె జి కన్నబిరన్‌





తెలంగాణ ఉద్యమం అనేకదశాబ్దాలుగా హింసా యుత సామాజిక కల్లోలానికి కారణభూతం. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమూ అంతిమంగా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణా పట్ల ఆసక్తి ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా రాష్ట్ర సాధన కోసం తుదిదాకా పోరాడే ఆసక్తి కనబర్చలేదు. ఈ సమస్యను సజీవంగా ఉంచాలనే ప్రచ్ఛన్న సంకల్పం రాజ కీయాలది. ఎప్పుడైనా అవసరమైతే సమస్యను ప్రకోపింప చేయడం ఎత్తుగడగా మారింది. ఇలాంటి రాజకీయం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి సహజాతం. ఇప్పుడు సమస్య పరిష్కా రానికి సూచన కన్పిస్తున్నప్పటికీ తిరిగి మళ్ళీ మొదటికొస్తుందా అన్న సందేహం వెంటాడటానికి ఆ సహజాతలక్షణమే కారణం.

ప్రాతినిధ్యం


ఇప్పుడు సోనియాజీ చేతుల్లో సమస్య పరిష్కారం పెట్టారు. ఒక విధంగా దానితో నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందు కంటే ఇటీవలి కాలంలో దేశంలో అత్యంత సమర్థత కలిగిన నేతగా ఆమెను భావిస్తాను. కానీ, నాకు రాజ్యాంగపరమైన అభ్యంతరం ఉంది. రాజ్యాంగ బాధ్యతల నుంచి ఆమె స్వచ్ఛం దంగా వైదొలగింది. దేశ ప్రధాని కాదల్చుకోలేదు. పార్లమెంటు సభ్యురాలిగా మాత్రమే ఉంది. కాకపోతే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు రాలు. అలా తన పార్టీ రాజకీయ నిర్ణయాలకు ఆమె ప్రాతి నిధ్యం వహించవచ్చు. కానీ తెలంగాణా ప్రజల ప్రయోజ నాలకూ తపనకూ ఆమె ప్రతినిధి కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వంటి విషయాల్లో ఆమె పాత్ర రాజ్యాంగ సహిత పాత్ర కాదు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగమే వీలు కల్పించింది. కాబట్టి రాజ్యాంగపర అధికారం మాత్రమే ఆ పని చేయాల్సిఉంది. సోనియాను అనుసరించే పనికిమాలిన గుంపు ఆమెకు ఆపాదించిన పాత్ర ఎప్పటికీ రాజ్యాంగబద్ధం కాదు.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి శాసనాలు సుస్పష్టం. రాజ్యాంగంలోని 2, 3, 4 అధికరణలు ఆ విషయం చెప్తు న్నాయి. పార్లమెంటుకి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారాన్ని 2వ అధికరణం ధారాదత్తం చేసింది. అలాంటి కొత్త రాష్ట్రం వల్ల ఏ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల్లోనైనా మార్పులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ రాష్ట్ర శాసనసభకు దేశాధ్యక్షుడు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లును పంపి అభిప్రాయం అడగాలి. అందుకు తగు సమయాన్నివ్వవచ్చు. కానీ ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయానికి విరుద్ధంగా సైతం పార్లమెంటు వ్యవహరించవచ్చు. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని ఖచ్ఛితంగా పార్లమెంటు మన్నించాలనే నిబంధన లేదు. ఇదే విషయాన్ని బాబూలాల్‌పరాటే వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బాంబే (1960) కేసులో భారత సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. రాజ్యాంగంలోని 4వ అధికరణం కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కూడికలు, తీసివేతలు, రాజ్యాంగ షెడ్యూళ్ళలో తదనుగుణ మార్పుల గురించి పేర్కొంటుంది.

ఇప్పటికీ తేలని నీటి సమస్య


తెలంగాణ సమస్య ఐదు దశాబ్దాలపాటు నానుతూ ఉంది. ప్రారంభంలో బలీయంగా పెను తుపాన్‌లా ఉంది. ఉక్కు సంకల్పంతో ఉద్యమం జరిగింది. కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1972లో ఉద్యమాన్ని ప్రభుత్వోద్యోగుల పోరాటంగా చూశారు. ఈ భావన రాజ్యాంగ సవరణకు దారితీసింది. తెలంగాణా ప్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ 371డి అధికరణను చేర్చారు. దానితో పాటు సమస్యకు కొంత పైపై పూతలు పూశారు. కానీ తెలంగాణలోని ఇతర ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వలసవచ్చి భూములు, ఇతర స్థిరాస్తులు కొనుగోలుచేశారు. తిరిగి వెనక్కువెళ్ళడం అసాధ్యం అయ్యేలా వ్యవహరించారు. నదీ పరివాహక ప్రాంతమైన ప్పటికీ, రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీరు తగినంతగా దక్కని పరిస్థితి తెలంగాణది. ఇతర సమస్యలతో పాటు ఇవి ప్రధాన సమస్యలు. ప్రాంతీయ దౌష్ట్యం గురించిన చర్చలో భాషా సంస్కృతులు కూడా చాలా ప్రధాన విషయాలే.

ఆర్థిక అస్థిరత్వం


ఇప్పుడు కెసిఆర్‌ తెలంగాణా ప్రతినిధి. అతని పోరాటం వెనుకటి మాదిరిగా జిమ్మిక్కు కాదు. విద్యార్థుల నిరసనవల్ల దీక్ష కొనసాగించాడు.పెద్దపెట్టున స్వచ్ఛందంగా ప్రజా ఉద్యమం నడిచింది. రాజకీయ సుస్థిరత లేకుండా ప్రపంచీకరణ రాజకీయాలు పురోగమించలేవని కేంద్రం గుర్తించింది. రాజకీయ అస్థిరత్వం ఆర్థిక అస్థిరత్వాన్ని చుట్టుముట్టకుండా చూసుకోవాలి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడిఉన్నామని చెప్పక తప్పలేదు. కానీ, కోస్తా, రాయలసీమ రాజకీయవేత్తలు రాజీనామాలతో ఎదురొడ్డుతున్నారు.నిక్కచ్ఛిగా చెప్పాలంటే, వారి ఆక్రోశానికి కారణం తెలంగాణాలో వారు పెట్టిన పెట్టు బడులు, సంపాయించిన ఆస్తులు.తెలంగాణా పల్లె ప్రాంతాల్లో సైతం భౌతికవనరులపై కన్నేసి వలసీకరించడం జరిగింది. రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వాళ్ళంతా ఆ వలసవాదులే. కానీ వారు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమం చేయగలరు, కానీ తెలంగాణలో కాదు. రాష్ట్ర రాజధానిలో కానీ, తమ ప్రాంతంలో కానీ సమైక్యవాదులు ఆస్తుల విధ్వంసానికి పాల్పడలేదు.

ఎందుకంటే వాళ్ళ ఆస్తిని వాళ్ళే ధ్వంసించుకోవాలి. ఆంధ్ర, రాయలసీమ నేతలు రాజ్యాంగాన్ని చదువలేదు. మన సమాజ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ రచన జరిగింది. విభిన్నత్వానికీ, ఏకత్వా నికీ చోటు కల్పించారు. కానీ, మన రాష్ట్రంలో ప్రాంతీయ ఆధిపత్యవర్గం తన ప్రయోజనాలకోసం పనిచేసింది. రాజ్యాంగ స్ఫూర్తి రాష్ట్ర పాలనలో కరువైంది. అలాంటి పాలన తెచ్చి పెట్టిన చేటును ఇప్పుడు మన రాష్ట్రం అనుభవిస్తోంది.

సమానత్వ ప్రాతిపదిక


కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలిపింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రవలసవాదుల ప్రయోజ నాలను సైతం అది పట్టించుకోవాలని సమైక్య ఉద్యమకారుల భావన. తెలంగాణా ఏర్పాటే వలసవాదుల నుంచి ఆ ప్రాంత ప్రజలను రక్షించడంకాగా, సరిగ్గా దానికి విరుద్ధంగా వలస వాదుల ప్రయోజనాల పరిరక్షణను సమైక్య ఉద్యమం ముందుకు తెచ్చింది. రాజ్యాంగంలో సమానత్వ సూత్రరీత్యా ప్రాథమిక విధులలో పేర్కొన్న సౌభ్రాతృత్వం వెలుగు ఈ సమస్యను పరిష్కరించాలి. విద్వేషాలకు తావివ్వరాదు.రాజ్యాంగం ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకును పార్లమెంటుకు అప్ప జెప్పడానికి కారణం అది జాతీయ సమస్య అనే భావన తోనే. ప్రజా శ్రేణుల బహుళత్వాన్ని రాజ్యాంగం గుర్తించింది. బహు ళత్వం ప్రాతిపదికగా పరిపాలనా సూత్రాలను రూపొందించు కుని

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా ఏకబుద్ధితో మెలగాలి.

సౌహార్ధ్ర సంబంధాలు నెలకొల్పే దిశగా పనిచేయాలి. బహుళ అస్తిత్వాలను పట్టించుకోని వైఖరివల్లే దేశంలో ఇప్పటికే పలు దుష్పరిణామాలు సంభవించాయి. రాజ్యాంగాన్ని సీరియస్‌గా తీసుకొని బహుళ పరిపాలనను కూడా సీరియస్‌గా తీసుకొని ఉంటే ఇలాంటి దుస్థితి తలెత్తేదికాదు.కేంద్రం తెలంగాణా సమస్యపై సత్వర నిర్ణయం తీసు కొనక మొన్నటివరకూనాన్చి హింసాత్మక సామాజిక కల్లోలానికి కారణభూతమైంది.ఇప్పుడు సుహృద్భావ వాతావరణం దెబ్బ తినేలా పరిస్థితి దిగజారుతోంది. ఇప్పటికైనా త్వరగా రాష్ట్ర ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రజల్లో సుహృద్భావాన్ని పెంపొందించాల్సి ఉంది. మరోసారి తెలంగాణా ఓటమిపాలు కారాదు.రచయిత రచయిత పియుసిఎల్‌ జాతీయ అధ్యక్షుడు



No comments:

Post a Comment