Friday, September 24, 2010

సత్‌పౌరులూ .. - సంపన్నులూ ...

ఈశతాబ్ది ఆరంభంలో మా ఊరు బెంగళూరు,ఆర్థిక ప్రపంచీకరణ సత్ఫలితా లకు ఒక ఉదాహరణ అయింది. సరళీకృత ఆర్థిక విధానాలతో సమకూరుతు న్న లబ్ధిని భారతీయులకు బెంగళూరే విశదం చేసింది. నగరానికి గర్వకారణమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ, బహుళజాతి కంపెనీలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలను సమకూర్చడం ద్వారా దేశానికి అపార విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జిస్తోంది.

వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టించింది. సంప్రదాయక వస్తూత్పత్తి రంగంతో పోలిస్తే ఈ కొత్త పరిశ్రమతో పర్యావరణానికి హాని చాలా తక్కువ.

ఐటి కంపెనీల వ్యవస్థాపకులు సామాన్య, మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చినవారు కావడం వల్ల ఆ వ్యాపార రంగ శీఘ్ర పురోభివృద్ధి ప్రజలలో అమితాసక్తిని రేకెత్తించింది. వారసత్వంగా కాక స్వయంకృషితో సంపాదించుకున్న అపరిమిత ధనరాశులను సమాజ శ్రేయస్సుకు వినియోగించడంలో ఐటి ఐశ్వర్యవంతులు ఉదారంగా వ్యవహరిస్తున్నారు.

ఈ విషయంలో ఇన్ఫోసిస్‌ది  ప్రశంనీయమైన ఆదర్శం. తాము నెలకొల్పి, అభివృద్ధి చేసిన సంస్థ నుంచి తమ బిడ్డలను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచిన కొత్త యాజమాన్య విలువల వైతాళికులు ఇన్ఫోసిస్ డైరెక్టర్లు. విలాసపూరిత జీవితాలకు స్వస్తి చెప్పి నిరాడంబర పూరిత జీవన శైలిని వారు అలవర్చుకున్నారు.

సంపదను అందరికీ ఆడంబరంగా ప్రదర్శించే సంపన్న వాణిజ్య వర్గాల సభ్యతారహి త ధోరణికి ఇన్ఫోసిస్ వారి వ్యవహరణ పూర్తి విరుద్ధం.

విద్య, ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణ మొదలైన సామాజిక అంశాలకు పెద్ద ఎత్తున ఉదారంగా నిధులు సమకూర్చడం ద్వారా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ప్రజల్లో మరింత మంచి పేరు సముపార్జించుకున్నారు.

నా సొంత రాష్ట్రమైన కర్ణాటక ఈ దశాబ్ది తొలినాళ్ళలో ఆర్థిక ప్రపంచీకరణ దుష్ఫలితాలకు ఒక ప్రతీక అయింది. ప్రభుత్వ సమాచారం ప్రకారమే 2000-10 సంవత్సరాల మధ్య కర్ణాటక నుంచి కనీసం మూడు కోట్ల టన్నుల ముడి ఇనుము చట్ట విరుద్ధంగా ఎగుమతి అయింది.

సరైన లైసెన్స్ లేకుండా, అవసరమైన పన్నులు చెల్లించకుండానే అధికారికంగా 'అడవి'గా గుర్తింపబడిన ప్రాంతాలలో ఆ ముడి ఖనిజపు తవ్వకాలు జరిగాయి. ముడి ఇనుమునుపెద్ద ఎత్తున దిగుమతి చేసుకొంటోన్న చైనా కు మరింతగా ఆ ఖనిజాన్ని ఎగుమతిచేసి ఇతోధిక లబ్ధి పొందడానికి కర్ణాటక సంకల్పించుకొంది.

ఐరన్ ఓర్ మైనింగ్‌కు విచక్షణా రహితంగా అనుమతి ఇవ్వడం ద్వారా బళ్ళారి జిల్లాలో సామాజిక, పర్యావరణ విధ్వంసాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పక తప్పదు.

బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు భారీ వేతన భత్యాలు లభిస్తాయి; శుభ్రమై న, ఆరోగ్యవంతమైన, నియంత్రిత వాతావరణంలో వారు పనిచేస్తారు. ఆరోగ్య భద్ర తా సదుపాయాలు వారికి పూర్తిగా అందుబాటులో ఉంటాయి. మరి బళ్ళారిలోని గని కార్మికులకు చట్టం ప్రకారం చెల్లించాల్సిన కనీస వేతనాల కంటే తక్కువే చెల్లిస్తా రు. మండే ఎండలో దాదాపు పగలంతా పనిచేస్తారు.

పనిచేస్తున్నంత సేపూ కాలుష్యకోరల్లో ఉంటారంటే అతిశయోక్తిలేదు. మైనింగ్‌తో పోల్చితే ఆటో మోబైల్, ఐటి పరిశ్రమలు భూగర్భ సంపదను తక్కువగా వినియోగించుకొంటాయి. ముఖ్యంగా ఐటి పర్యావరణ కాలుష్యానికి ఏ మాత్రం దోహదం చేయని పరిశ్రమ.

ముడి ఇనుము కోసం జరుగుతోన్న అన్వేషణలో బళ్ళారి అడవులు తరిగిపోతున్నాయి; బళ్ళారి నేల లు పంటల సాగుకు పనికి రాకుండాపోతున్నాయి. జల వనరులపై చాలా తీవ్ర ప్రభావం పడుతోంది. నదులు కాలుష్య కూపాలుగా మారిపోతున్నాయి.

కార్మికుల స్థితిగతులు, పర్యావరణ పరిస్థితి దృష్ట్యా బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ పరిశ్రమల, బళ్ళారిలోని ఐరన్ ఓర్ మైనింగ్ మధ్య వ్యత్యాసాలు అపారం. ఈ రెండు రంగాలలోని కంపెనీల వ్యవస్థాపకుల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు వారి మధ్య తారతమ్యాలు మరింత ఎక్కువగా కన్పిస్తాయి. సాప్ట్‌వేర్ సంపన్నులు ఉత్తమ పౌరులు. వారు తమ సంపదలో చాలా భాగా న్ని తిరిగి సమాజానికి ఇస్తున్నారు. అయితే బళ్ళారి గనుల ఆసాములు వారికి వారే ప్రభువులు.

చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. జిల్లాలోని పోలీసు, పౌర యంత్రాంగంమంతా వారికి దాసోహ మే. వారి మాటకు తిరుగులేదు. మరే భారతీయ నగరంలో లేని విధంగా బళ్ళారిలో అత్యధిక తలసరి మెర్సిడీజ్ కార్లు ఉన్నాయి.

పాఠశాలలకు, ఆస్పత్రులకు బళ్ళా రి గనుల ఆసాములు ఉదారంగా ఆర్థిక సహాయమందించినట్టు నేను ఇంతవరకు వినలేదు, చదవలేదు. వారు ఒకే ఒక్క విలువైన కానుకను ఇచ్చారు-అది తిరుపతి వేంకటేశ్వరస్వామికి . 45 కోట్ల రూపాయల విలువైన వజ్రాల కిరీటాన్ని ఆ స్వామికి సమర్పించుకున్నారు.తమ చట్టోల్లంఘనలను, నైతిక విలువల అతిక్రమణలను పట్టించుకోవద్దని దేవుళ్ళను వేడుకోవడానికే బహుశా వారు ఆ వితరణ చూపి ఉంటారు.

బళ్ళారి గనుల ఆసాములు తిరుపతి స్వామికేనా కానుకలు సమర్పించుకొంది? కానే కాదు. రాజకీయ పార్టీలకూ వారు విలువైన కానుకలే ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రచార వ్యయాన్ని పూర్తిగా వారే భరించారనేది విశ్వసనీయ జనశృతి. బిజెపి, దాని మిత్రపక్షాలకు మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తో బళ్ళారి గనుల ఆసాములకు ఏకంగా మూడు కేబినెట్ మంత్రి పదవులు లభించా యి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ పరిణామాల పట్ల అసంతృప్తితో ఉందని అంటున్నారు. అవినీతిపరులైన అవకాశవాదులను అందలాలెక్కించడం పార్టీకి మంచిది కాదని ఆరెస్సెస్ పెద్దలు భావించారు. అయితే బిజెపి నాయకత్వం వారి అభ్యంతరాలను తోసిపుచ్చింది.

ఒక దక్షిణాది రాష్ట్రంలో తక్షణమే అధికారానికి రావాల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతైనా ఉంది మరి. సరే, గనుల యజమానులలో కొంతమంది బిజెపి పక్షాన ఉండగా మరికొందరు కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నారు.

వారిలో కొందరు కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఎన్నికలలో పోటీ చేయడం కూడా జరిగింది. వాస్తవానికి కర్ణాటక బిజెపి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురు మహాశయుల ను తొలుత ప్రోత్సహించింది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ సహాయ సహకారాలు కూడా ఆ ముగ్గురికీ పూర్తిగా ఉన్నాయనే విషయాన్ని మనం విస్మరించకూడదు.

బళ్ళారి గనుల ఆసాముల ఉత్థానంపై పరంజోయ్ గుహ థాకుర్తా ప్రస్తుతం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా న్యూఢిల్లీ లో నివసిస్తున్నప్పటికీ తన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న వ్యక్తి థాకుర్తా. అనుభజ్ఞుడైన పాత్రికేయుడు.

సహచర పాత్రికేయులు అమితంగా గౌరవిం చే మాన్యు డు థాకుర్తా. తూర్పు భారత రాష్ట్రాలలో మైనింగ్ కార్యకలాపాల రాజకీయ, సామాజిక, పర్యావరణ పర్యవసానా లు విస్తృతంగా అధ్యయనం చేసిన సామాజిక వేత్త థాకు ర్తా. బళ్ళారి గనుల ఆసాములపై డాక్యుమెంటరీ నిర్మాణంలో ఆ అనుభవం ఆయనకు ఎంతైనా ఉపకరించగలదనడంలో సందేహం లేదు.

బళ్ళారిలో షూటింగ్ అనంతరం థాకుర్తా ఇటీవల బెంగళూరు వచ్చారు. నేరస్తు లు, వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలు ఇంతగా కుమ్మక్కవడం కర్ణాటక మైనింగ్ కార్యకలాపాలలోనే మొట్ట మొదటిసారిగా కన్పిస్తుందని థాకుర్తా అన్నారు. గతంలో ముంబైమస్తాన్ ఒకరు అప్పుడప్పుడూ ఎన్నికలలో పోటీచేసేవాడు. ఇతర మస్తాన్ లు అందరూ ఆ 'రాజకీయవేత్త'కు మద్దతు నిచ్చేవారు.

అయితే చట్ట విరుద్ధంగా, పైగా హింసాత్మక పద్ధతులలో కూడా ఆస్తులు కూడబెట్టుకున్న వారు ఒక భారతీయ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకోవడమనేది ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

ఇక్కడ సంక్షేపించిన రెండు గాథల- బెంగళూరు సాఫ్ట్‌వేర్ సంపన్నుల, బళ్లారి గనుల ఆసాముల-విశాల పాఠాలు ఏమిటి? ప్రపంచీకరణకు శుభప్రదమైన పార్శ్వ మే కాదు, దుర్మార్గమైన పార్శ్వమూ ఉంది. ఇంధనాన్ని అంతగా ఉపయోగించుకోని, పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులను నాలెడ్జ్ వర్కర్స్ సృష్టించే అవకాశాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కల్పించినప్పుడు వాటిని మనం పూర్తిగా వినియోగించుకోవాలి.

అయితే అందుకు బదులుగా అసలే తరిగిపోతోన్న సహజ వనరులను, పర్యావరణ ఆరోగ్యాన్ని విస్మరించి శీఘ్రగతిన వినియోగించుకోవడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనలను ప్రేరేపిస్తే ప్రపంచీకరణ ఉపయుక్తతను మనం సంశయించి తీరాలి.

మనకు అపార మానవ, సహజ వనరులు ఉన్న దృష్ట్యా ప్రపంచీకరణను మన శ్రేయస్సుకు ఉపయోగించుకోవడం ఎలా అన్నది ప్రభుత్వ విధానానికి సంబంధించిన విషయం. సంపదను ఎలా సమకూర్చుకోవాలి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. అపర కుబేరులమయి పోదామనే ఆరాటంలో బళ్ళారి గనుల ఆసాములు చట్టాన్ని పాటించలేదు; సహచర పౌరుల శ్రేయస్సునూ పట్టించుకోలేదు.

అయితే బెంగళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీల వ్యవస్థాపకులు తమ ఐశ్వర్యాన్ని న్యాయబద్ధంగా సముపార్జించుకున్నారు. అందులో స్వల్ప భాగాన్ని తమ సొంతానికి వాడుకున్నారు; గణనీయమైన భాగాన్ని వివిధ దాతృత్వ, లోకకల్యాణ కార్యకలాపాలకు వినియోగించారు.

దశాబ్ద కాలంలోనే మా ఊరు, మా రాష్ట్రం ప్రపంచీకరణ మంచీ, చెడూ రెండిటికీ లోనయ్యాయి. ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానం ఆవిర్భావంతో మంచి జరుగగా అనాగరిక పెట్టుబడిదారీ వ్యవస్థ దానిని బలహీనపరచడంతో చెడు సంభవిస్తోంది. 

-రామచంద్రగుహ